Political News

జపాన్ ప్రధాని ఇండియాకు వచ్చింది అందుకా?

జపాన్ ప్రధాని మనదేశం ఎందుకొచ్చాడో తర్వాత తెలుసుకుందాం. ముందుగా జపాన్ గురించి రేఖామాత్రంగా పరిచయం చేసేకుందాం. మనదేశం ఇటీవల కాలంలో అతి దగ్గరగా వ్యూహాత్మక సంబంధాలు నెరపుతున్న దేశాల్లో జపాన్ ఒకటి. పసిఫిక్ మహా సముద్రంలో చిన్న చిన్నదీవుల సముదాయంతో కూడిన దేశమే జపాన్. విస్తీర్ణం రీత్యా ప్రపంచంలో 61వ స్థానంలో జనాభా రీత్యా పదో స్థానంలో ఉంది. దీని రాజధాని టోక్యో. ప్రపంచంలోనే అతిపెద్ద నగరాల్లో ఒకటి. రెండో ప్రపంచ యుధ్దకాలంలో అమెరికా చేతిలో అణు దాడికి గురై అపార జన – ఆస్తి నష్టాలను చవిచూసిన జపాన్.. గోడకు కొట్టిన బంతిలా – ఫీనిక్స్ పక్షిలా పైకి లేచింది. ప్రపంచంలోనే అతి ప్రమాదకర అగ్నిపర్వతాలు దేశంలో ఉన్నా బెదిరిపోకుండా ఉన్న మానవ వనరులను వాడుకుని అద్భుతమైన ప్రగతిని సాధించింది.

ప్రపంచంలో వయోవృద్ధులు ఎక్కువ గా ఉన్న దేశం అయినప్పుటికీ శాస్ర్త – సాంకేతిక రంగాల్లో అసమాన ప్రతిభను చాటుకుంటోంది. ఆటోమొబైల్స్ ను ప్రపంచంలోని దాదాపు అన్ని దేశాలకు అమెరికాతో సహా ఎగుమతి చేస్తోంది. ప్రపంచంలోని అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల్లో ఒకటిగా అత్యంత అభివృద్ధి చెందిన దేశాల కూటమి జీ-8లో ఆసియా ఖండం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఏకైక దేశంగా జపాన్ ఖ్యాతి గడించింది. సూర్యుడు ఉదయించే దేశం (సన్ రైజెస్ కంట్రీ)గా పేరుగాంచింది తాజాగా జపాన్ ప్రధాన మంత్రి షింజో అబే – ఆయన సతీమణి అకీ అబేలు మనదేశాన్ని సందర్శించారు.  అహ్మదాబాద్ విమానాశ్రయంలో బుధవారం సాయంత్రం దిగిన వీరిద్ధరికి ప్రొటోకాల్ పక్కనపెట్టి మరీ ప్రధాని నరేంద్ర మోదీ ఘన స్వాగతం పలికారు.  ప్రధానమంత్రులిద్దరూ అహ్మదాబాద్ నుంచి సబర్మతి ఆశ్రమం వరకు జరిగిన రోడ్ షోలో పాల్గొన్నారు.
 
మనదేశంలో జపాన్ టెక్నాలజీతో – ఆ దేశ సహాయ సహకారాలతో పట్టాలెక్కనున్న బుల్లెట్ రైలు ప్రాజెక్టుకు షింజో శంకుస్థాపన చేస్తారు. అంతేకాకుండా రకణ సంబంధాలను ఇరు దేశాలు పటిష్టం చేసుకుంటాయి. చైనాతో ఇరుదేశాలకు సరిహద్దు తగదాలున్నాయి. జపాన్ కు పొరుగునే సముద్రంలో ఉన్న సెనెకాకు దీవులను చైనా తనవే అంటోంది. మరోవైపు భారత్ తో సరిహద్దుల దగ్గర ప్రతిసారి లడాయికి దిగుతోంది. ఈ నేపథ్యంలో ఇరు దేశాలు మరింత సన్నిహితమవనున్నాయి. ఇప్పటికే ప్రతి ఏటా ఇరు దేశాలు అమెరికాతో కలిసి హిందూ మహా సముద్రంలో త్రైపాక్షిక సైనిక విన్యాసాలు నిర్వహిస్తున్నాయి. బుల్లెట్ రైలుకు చైనా సాయం చేస్తానన్న కాదని జపాన్ కు పెద్దపీట వేయడానికి కారణం కూడా ఇదే. మరోవైపు ఉత్తర కొరియా.. జపాన్ ను కూడా తన శత్రు దేశంగా పరిగణిస్తోంది. ఇటీవల ఉత్తర కొరియా ప్రయోగించిన క్షిపణి జపాన్ సముద్ర  జలాల్లో పడింది. ఉత్తర కొరియాకు అణు సామర్థ్యం – టెక్నాలజీని బదలాయిస్తున్న దేశాలు రెండే రెండు.. అవి ఒకటి చైనా – రెండు పాకిస్థాన్. ఈ నేపథ్యంలో జపాన్ – భారత్ తమ సంబంధాలను  అత్యున్నత స్థాయికి చేర్చుకోవాలని సంకల్పించాయి.